కలం, వెబ్ డెస్క్: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని.. వచ్చాకే అధికారికంగా స్పందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన చర్చించామని తెలిపారు. చాలా ప్రజాస్వామికంగా స్పీకర్ ప్రతి సభ్యునికి అవకాశం కల్పించారని చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకుండా పోయారని విమర్శించారు.
రూల్స్ ఉల్లంఘిస్తే స్పీకర్ సస్పెండ్ చేస్తారనితెలిసే.. ప్రతిపక్ష సభ్యులు స్లోగన్స్ ఉన్న టీషర్టులు వేసుకుని వచ్చారని మంత్రి తెలిపారు. సభలో పొడియం వద్దకు వెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ ప్రసాద్ కుమార్పైన వాడకూడని పదంతో దూషించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన అందరినీ బాధపెట్టిందని తెలిపారు. అసెంబ్లీని 8 రోజుల పాటు (51 గంటల 52 నిమిషాల పాటు) జరుపుకున్నామని అన్నారు. 50 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయని పేర్కొన్నారు. నాలుగు బిల్లులను పాస్ చేసుకున్నామని తెలిపారు.
సభలో 22ఏ భూముల అంశంపై ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం పై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమగ్రంగా ప్రజలకు వివరణ ఇచ్చారని శ్రీదర్ బాబు తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, భవనాలు ఉన్న వాళ్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించారని అన్నారు. సమస్యల పరిష్కారం పైన హైపవర్ ఆఫీషియల్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారని చెప్పారు.
ఎల్ నినో కరువు పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో మాట్లాడారని శ్రీధర్ బాబు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వారి అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తారని భావించామని.. సభకు రమ్మని వారికి విజ్ఞప్తి చేశామని అన్నారు. కానీ కేసీఆర్ సభకు రాలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రవర్తన ఎలా ఉందో అందరూ చూశారని విమర్శించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్కు క్షమాపణ చెప్తారని ఆశించామని.. కానీ వారు క్షమాపణ చెప్పలేదన్నారు.
గౌరవప్రదమైన సభను బీఆర్ఎస్ సభ్యులు మాక్ అసెంబ్లీ పెట్టి హాస్యస్పదంగా చేశారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను తమ విప్లు కోరారని అన్నారు. అసెంబ్లీని రెండు నెలలు జరపాలని మాట్లాడిన కేటీఆర్.. కనీసం తమ పైన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరలేదని చెప్పారు. ప్రతిపక్షాలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అనేక విషయాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తే అధికార పక్ష సభ్యులు ధీటుగా స్పందించారని అన్నారు.

