కలం, యాదాద్రి భువనగిరి: పసిపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలల రక్షణపై సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఉషశ్రీ (Judge Ushasri) స్పష్టం చేశారు. బాలల రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలోని మదర్ థెరిసా హైస్కూల్లో సురక్షిత్ బచ్పన్ అభియాన్ జాతీయ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి ఎం.ఉషశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలు, బాలల హక్కులు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
మౌనంగా ఉండొద్దు..
పిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జడ్జి ఉషశ్రీ సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు, వేధింపుల గురించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా ప్రధానోపాధ్యాయులకు నిర్భయంగా చెప్పాలన్నారు. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులకు న్యాయం అందించేందుకు సమాజంలోని ప్రతి వర్గం సహకరించాలని పేర్కొన్నారు.
ఎక్కడైనా పిల్లలపై వేధింపులు జరుగుతున్నట్లు తెలిసినా, అనుమానం వచ్చినా మౌనంగా ఉండకుండా పోలీసులు, బాల సంక్షేమ కమిటీకి సమాచారం అందించాలని జడ్జి ఉషశ్రీ సూచించారు. ఆపదలో ఉన్న పిల్లలకు బాలల సంక్షేమ కమిటీ ద్వారా తక్షణ ఆశ్రయం, రక్షణ, పునరావాసం, కౌన్సెలింగ్ అందుతాయని వివరించారు. బాధిత పిల్లలు, వారి కుటుంబాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం, న్యాయవాది సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ పరిహారం పొందేందుకు సహకరిస్తుందని తెలిపారు.
అందుబాటులో అత్యవసర నెంబర్..
బాలలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులపై సమాచారం అందించేందుకు ఛైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098 అందుబాటులో ఉందని జడ్జి ఉషశ్రీ తెలిపారు. అవసరమైనప్పుడు వెంటనే ఈ నంబర్‌కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. బాలల సంరక్షణకు సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే పిల్లలకు నిజమైన రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎక్సైజ్ ఎస్ఐ అజీమ్, న్యాయ సహాయ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సంధ్య, ఛైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ దశరథ, పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

