కలం, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయాల కోసం భూ కొనుగోళ్లు చేపట్టడంపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆలయాల నిర్మాణాలకు స్థలం కొనుగోలు చేసేందుకు టీటీడీ అంగీకరించలేదని చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ ఆలయాలు నిర్మించినా దాతలు ఇచ్చిన స్థలాల్లోనే జరిగినట్లు వెల్లడించారు. చివరికి కల్యాణ మండపాలు కూడా దాతలు ఇచ్చిన స్థలాల్లోనే నిర్మించినట్లు వెల్లడించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కేవలం ఒకే ఒక్క ఆలయ నిర్మాణం చేపట్టారని, వెంకటాయపాలెంలో గుడి కోసం టీటీడీ స్థలం కొనేందుకు ఏర్పాట్లు చేస్తోందని విమర్శించారు. ఇది వేంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన గుడి కోసం స్థలం కొనుక్కొని, నేను గుడి కట్టుకుంటానని చంద్రబాబును భంగపడ్డట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వేంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా తమతో చెప్పిస్తున్నాడని భూమన వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారిని భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

