కలం, వెబ్ డెస్క్: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు (Employee Salaries) అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు నిల్ ఉంటే.. పదేళ్ల బీఆరెస్ హయాంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పేరుకుపోయాయని ఆరోపించారు. దీనిపై ఒక కసరత్తు చేసి సమస్యల పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. 100 రోజుల్లో దాదాపు రూ.6 వేల కోట్లు పెన్షనర్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించారని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారని చెప్పారు.

