కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ (KCR)కు స్పష్టంగా చెబుతున్నానని.. తాను అనేక అంశాలపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ మార్గాల్లో చేసిన అప్పు మొత్తం కలిపితే రూ.8.21 లక్షల కోట్లు అని వెల్లడించారు. ఇందులో గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ ఎవరు చెల్లిస్తారు? అంటూ ఫైర్ అయ్యారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అప్పులు వాస్తవం కాదా?..
‘కేసీఆర్ చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? 2014 నుంచి 2023 వరకు మీరే కదా? ఇవి దాస్తే దాగేవి కావు కదా?’ అంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావుకు గతం లేదని, భవిష్యత్తు కూడా లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు గాను అసలు, వడ్డీ కలిపి రెండున్నరేళ్లలో రూ.2,08,061 కోట్లు చెల్లించామని తెలిపారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్..
రాష్ట్రంలో అప్పులు చెల్లిస్తూనే అనేక పథకాలు చెల్లిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంపై వేసిన భారాన్ని తక్కువ చేసి చూపేందుకు కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు స్థాయి తగ్గించుకొని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అప్పుల పునాదులపై ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమని అన్నారు. వాస్తవాలు చెబితే రాష్ట్ర పరిస్థితి దెబ్బతింటుందనే.. చాలా కాలం మౌనంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అంటూ మండిపడ్డారు.

