కలం, నిర్మల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భైంసా (Bhainsa) పట్టణంలోని ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రంలో (Khelo India Wushu Center) క్రీడాకారులకు వివిధ వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు. శిక్షణ కేంద్రం కోచ్ సాయికృష్ణ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ రజిత పతకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ క్రీడల్లో ప్రతిభను మరింతగా పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చడం, క్రమశిక్షణ, పట్టుదలతో పాటు జట్టు స్ఫూర్తిని పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యాన్నే కాకుండా మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. యువత విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు ముగ్ధం విక్రమ్, ప్రకాష్ పాటిల్, ఉప్పు రవీందర్, సాయినాథ్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఖేలో ఇండియా వూషూ శిక్షణ కేంద్రం క్రీడాకారులు, కోచ్లు, క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

