కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem)లో గ్యాస్ సిలిండర్ల అక్రమంగా నిల్వ ఉంచినా, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయశాఖ, ఇరిగేషన్‌శాఖ, పౌరసరఫరాలశాఖల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే అధిక మొత్తంలో బుకింగ్ చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రజలకు అవగాహన కల్పించండి
దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అలాగే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వచేయడం, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం వంటి చర్యలను కట్టడి చేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem)లో రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుభరోసా, రైతు భీమా పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో పంటల వారీగా సాగు విస్తీర్ణం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు .
సాగునీటి వనరులపై నిర్లక్ష్యం వద్దు
ఇరిగేషన్‌శాఖ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాల్వలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకొని, జిల్లాలో సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పౌరసరఫరాలశాఖకు సంబంధించి జిల్లాలో పనిచేస్తున్న రేషన్ దుకాణాల సంఖ్య, లబ్ధిదారులకు అందుతున్న సన్నబియ్యం పంపిణీ వివరాలు, నిల్వలు, సరఫరా పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరేగేషన్ ఈఈ అర్జునరావు, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: వేసవిలో చర్మ సౌందర్యం కోసం ఈ జ్యూస్ తాగండి
Follow Us On: Facebook

