ధాన్యం అన్‌లోడింగ్‌పై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో: మొక్కజొన్న కొనుగోళ్లలో ధాన్యం అన్‌లోడింగ్‌పై భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు కీలక ఆదేశించారు. రైతులకు, రవాణాలో లారీ డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోడౌన్ల వద్ద రాత్రి సమయంలో కూడా అన్‌లోడింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం ఆయన లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చిలక మొక్కజొన్న నిల్వ గోడౌన్‌తో పాటు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. బంగారు చిలక మొక్కజొన్న గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, వివిధ మండలాల నుండి ఇక్కడికి వస్తున్న లారీల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

అదనపు హమాలీలను నియమించుకోండి

అవసరమైతే అదనపు హమాలీలను నియమించాలని సూచించారు. 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ గోడౌన్‌లో పంట నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా బస్తాలను సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో పేర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హమాలీలతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్, వారికి తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం

అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద రూ.5 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన పనులను కలెక్టర్ పరిశీలించారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల జాప్యానికి గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్లకు వెంటనే మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

భవన నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు

మహిళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు వేదికగా నిలిచే ఈ భవననిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. రోజువారీ పనులను పర్యవేక్షిస్తూ, అదనపు కార్మికులను నియమించి నిర్ణీత గడువులోగా భవనాన్ని అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ శిరీష, పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>