కలం, ఖమ్మం బ్యూరో: ఉద్యోగం వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డ నిరుద్యోగ కుటుంబాల ఆశలను ఆసరాగా చేసుకుని, సొంత ఆటోలను అమ్ముకొని, ఇంటి ఆడపడుచుల బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చిన సొమ్మును నమ్మి అప్పగించిన అమాయకులు చివరికి రోడ్డున పడ్డారు. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ (Bhadrachalam MLA PA) కొర్ల కల్యాణ్ కుమార్ అవినీతి దందాలో ఇప్పటివరకు సుమారు 150 మందికి పైగా బలికాగా, కోట్లాది రూపాయల మేర మోసం జరిగినట్లు వెల్లడవుతోంది. అయితే, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇద్దరు పీఏలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఇసుక, ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం పక్కనే ఉంటే పీఏల దందా ప్రజాప్రతినిధికి తెలియకుండా ఎలా సాగుతుందంటూ ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సబ్‌కలెక్టరేట్‌లో పనిచేసిన అనుభవం ఉన్న కల్యాణ్, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సీళ్లు, శాఖల ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ నియామక పత్రాలను సృష్టించడంలో దిట్టగా మారాడు. మణుగూరు బీటీపీఎస్ (BTPS) భూ నిర్వాసితులు, ఐటీసీ, సింగరేణి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఫోన్లు చేసి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూళ్లకు తెగబడ్డాడు. చర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లోని ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడిపాడు. ఈ క్రమంలోనే భద్రాచలానికి చెందిన ఒక వైద్యుడి నుంచి రూ.40 లక్షలు, ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పి ఆబ్కారీ శాఖకు చెందిన ఒక అధికారి నుంచి రూ.10 లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది.
కేవలం ఉద్యోగాల పేరుతోనే కాకుండా ఇసుక ర్యాంపుల పేరుతోనూ కల్యాణ్ కోట్లు కొల్లగొట్టాడు. నల్లగొండ, ములుగు, ఖమ్మం జిల్లాల నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చే ఇసుక కాంట్రాక్టర్లు, స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులతో ఒప్పందాల పేరుతో భారీగా డబ్బులు లాగాడు. ఉద్యోగాల నియామకాల్లో ఇచ్చిన ఫేక్ ఆర్డర్లు బయటపడటంతో కొందరికి డబ్బులు వెనక్కి ఇచ్చినప్పటికీ, మెజారిటీ బాధితులు మాత్రం నిలువునా మునిగిపోయారు. ఆరు నెలల క్రితం కూడా ఎమ్మెల్యే ప్రైవేటు పీఏగా వ్యవహరించిన మరో వ్యక్తి ఇసుక ర్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేయడంతో, ఆయనను కార్యాలయం నుంచి పక్కన పెట్టారు. అది మరవక ముందే మళ్లీ అదే క్యాంపు ఆఫీస్ కేంద్రంగా ప్రస్తుత పీఏ కల్యాణ్ కోట్ల రూపాయలు దండుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే తిరిగే వ్యక్తులు నిరుద్యోగులను నట్టేట ముంచుతుంటే ఎమ్మెల్యే స్పందించిన తీరు, పర్యవేక్షణ లోపంపై బాధితులు మండిపడుతున్నారు.
ఈ కుంభకోణంలో భద్రాచలానికి చెందిన రాయల శ్రీను అనే బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కల్యాణ్ పై కేసు నమోదు చేశారు. తన కొడుకు ఉద్యోగం కోసం ఆటోను, కూతురి బంగారాన్ని కుదువబెట్టి రూ.9.95 లక్షలు చెల్లించి మోసపోయానని, తమ కుటుంబం రోడ్డున పడిందని శ్రీను కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, నిందితుడు కొర్ల కల్యాణ్ కుమార్ భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది, వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి మళ్లించారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే కోణంలో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

