కలం, ఖమ్మం బ్యూరో: లక్షల రూపాయలు వసూలు చేసిన కార్పొరేట్ ఆసుపత్రులు నయం చేయలేని ప్రాణాపాయ స్థితి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల అంకితభావం, ఒక ప్రజాప్రతినిధి చూపిన సేవా చొరవతో ఆ నిరుపేద యువకుడికి పునర్జన్మ లభించింది. కార్పొరేట్ వైద్యం ఫెయిలైన చోట.. ప్రభుత్వ వైద్యం సక్సెస్ అయిందని భద్రాచలం ఏరియా ఆసుపత్రి మరోసారి నిరూపించింది. భద్రాచలం ఎమ్మెల్యే, ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ తెల్లం వెంకటరావు స్వయంగా రంగంలోకి దిగి చేసిన అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది.
వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ (28) అనే యువకుడు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని శరీరంలో దాదాపు 60 శాతం వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. దాదాపు రూ. 20 నుండి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ నిరుపేద కుటుంబం చికిత్స కోసం చివరకు తమకున్న పొలాలను కూడా విక్రయించాల్సి వచ్చింది. అంత చేసినా ఫలితం లేకపోగా, ఇక రూపాయి కూడా ఖర్చు పెట్టే స్థోమత లేక ఆ కుటుంబం తీవ్ర ఆవేదనతో దిక్కుతోచని స్థితికి చేరుకుంది.
ఆఖరి ప్రయత్నంగా బాధితుడి కుటుంబ సభ్యులు భద్రాచలం ఎమ్మెల్యే (Bhadrachalam MLA) డాక్టర్ తెల్లం వెంకటరావు (Dr Tellam Venkata Rao) ను ఆశ్రయించారు. వారి దయనీయ స్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రోగిని చేర్పించి, అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా తక్షణ చర్యలు చేపట్టారు. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న సమయంలో ఆసుపత్రిలో జనరల్ సర్జన్ అందుబాటులో లేకపోవడంతో.. స్వయంగా జనరల్ సర్జన్ అయిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు స్వయంగా రంగంలోకి దిగారు.
తన రాజకీయ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, ఒక వైద్యుడిగా ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టారు. సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సలో పాల్గొని, దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ఎమ్మెల్యేతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బి. దేవరాజ్, డాక్టర్ తాటి మల్లేష్, డాక్టర్ నికిత, డాక్టర్ కౌండిన్య, అనస్థీషియా బృందం, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమిష్టిగా శ్రమించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడుతూ, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంక్లిష్టమైన కేసుకు ఎమ్మెల్యే స్వయంగా శస్త్రచికిత్స చేయడం అభినందనీయమని, ఆయన సేవాభావం ప్రభుత్వ వైద్య సేవల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. రోగి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతూ.. “ఆస్తులన్నీ అమ్ముకున్నా మా బిడ్డ బతుకుతాడనే ఆశ లేని సమయంలో ఎమ్మెల్యే, ఏరియా ఆసుపత్రి సిబ్బంది దేవుడిలా వచ్చి మా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించగల సామర్థ్యం ఉందని భద్రాచలం ఏరియా ఆసుపత్రి మరోసారి నిరూపించిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

