కలం, వెబ్‌డెస్క్: మానవ మనుగడకు, ఆరోగ్యానికి నీరు అత్యంత అవసరం. ప్రతి మనిషి రోజుకు సగటున 3 నుండి 4 లీటర్ల నీరు తాగవలసి ఉంటుంది. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే బ్రష్ చేయడానికి ముందే నీరు తాగడం (Drinking Water) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు వైద్యులు. దీనివలన రోజంతా ఉల్లాసంగా ఉంటామని చెబుతున్నారు. అయితే కొంత మంది నిద్రలేచిన వెంటనే నీరు తాగితే.. మరికొంత మంది బ్రష్ చేసేంత వరకు నీటి జోలికి వెళ్లరు. ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటో తెలుసుకుందాం.
బ్రష్ చేయకముందు నీరు తాగితే ఏమవుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు మన నోటిలో ఊరే లాలాజలంలో జీర్ణక్రియకు సహయపడే ఎంజైములు ఉంటాయట. మనం బ్రష్ చేయకుండా నీరు తాగినప్పుడు ఆ ఎంజైములు నీటి ద్వారా మనం శరీరంలోకి వెళ్తాయి. ఈ ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా కడుపులోని యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి ఎసిడిటీ, గ్యాస్, అల్సర్ల వంటి సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుండి కోలుకుంటుందట. ఇది జీవక్రియను (మెటబాలిజం) మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుందట.
బ్రష్ చేసిన తర్వాత నీరు తాగితే ఏమవుతుంది
మనం బ్రష్ చేయడానికి రకరకాల టూత్ పేస్టులు వాడుతుంటాం. వాటిలో ఫ్లోరైడ్, ఇతర రసాయనాలు ఉంటాయి. అయితే మనం బ్రష్ చేసిన తర్వాత వాటి అవశేషాలు మనం నోటిలో ఉండిపోతాయట. మనం బ్రష్ చేసిన వెంటనే నీరు తాగడం వలన వాటి అవశేషాలు నీటితో కలిసి మన కడుపులోకి వెళ్లే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే బ్రష్ చేసిన తర్వాత నీరు తాగాలనుకునేవారు కనీసం 15 నంచి 20 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత నీరు తాగాలట. దీనివల్ల టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ దంతాలపై రక్షణ పొరను ఏర్పరచడానికి తగిన సమయం దొరుకుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

