కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు కమిషనర్ అజయ్ కుమార్ పదవి విరమణ చేసి రెండు నెలలు గడుస్తున్న నేటికీ నూతన కమిషనర్ నియమించకపోవడం చేత వైద్య ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, వైద్య ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ కమిషనర్ నియమించాలని కోరుతూ వైద్య విధాన పరిషత్ (TVVP) జేఏసీ పిలుపులో భాగంగా శనివారం జడ్చర్ల (Jadcherla) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటుదాం సమస్యను మనవి చేద్దాం అంటూ వైద్య ఉద్యోగులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలలుగా వైద్య ఉద్యోగులు సమస్యలను వినిపించేందుకు, సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం లేదని అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో దాదాపు 185 వివిధ స్థాయిల హాస్పిటల్స్ తో 4000 మంది సిబ్బందితో ప్రభుత్వ వైద్య సేవలలో అతి కీలకమైన పాత్ర పోషిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారబోతున్న వైద్య విధాన పరిషత్ కు, ఆ శాఖ కమిషనర్ పదవీకి ఇంతవరకూ రెగ్యులర్ కమిషనర్ ను నియమించక పోవడంతో ఆయా వైద్య శాలల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడడంతో పాటు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, మినిస్టీరియల్ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పేరుకుపోయిన తమ వ్యక్తిగత,సర్వీస్ పరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతో వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో ” మొక్కలు నాటుదాం..మనవి చేద్దాం” అంటూ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కు మొక్కలు, మా సమస్యల పరిష్కారానికి కమిషనర్ నియామకం అవసరమని ఇకనైనా తమ ఆవేదన అర్థం చేసుకుని వెంటనే రెగ్యులర్ కమిషనర్ ను నియమించాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు అందించే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందున వీధుల్లోకొచ్చి ఉద్యమాలు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించలేక ఇటువంటి సున్నితమైన చర్యల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, అనివార్యమైన పరిస్థితిలో తాము ఉద్యమాలు తీవ్రతరం చేయక ముందే ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షదుల్లా, ఆర్ యు ఓ హరినాథ్,డాక్టర్ కిరణ్,నర్సింగ్ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి,భాస్కర్, సివియర్ అసిస్టెంట్ రవి కుమార్, జేమ్స్, ప్రహ్లాద్,నర్సింగ్ ఆఫీసర్స్ విజయ లక్ష్మి, శాంత కుమారి, స్రవంతి, ఈశ్వర్, వేణు, కృష్ణ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

