కలం, వెబ్‌డెస్క్: 51 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడమే ధ్యేయంగా భారత హాకీ జట్టు ప్రపంచకప్ (Hockey World Cup) కు సిద్ధమైంది. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియా కుర్రాళ్లు సమరశంఖం పూరించారు. ముఖ్యంగా తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న నలుగురు యంగ్ స్టార్స్ గోల్‌కీపర్ మోహిత్ హెచ్ఎస్, డిఫెండర్ యశ్దీప్ సివాచ్, మిడ్‌ఫీల్డర్లు రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే మైదానంలో దూకుడు చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
నిన్నమొన్నటి వరకు బెంగళూరు జూనియర్ క్యాంప్‌లో మ్యాచ్‌లను టీవీల్లో చూసిన గోల్‌కీపర్ మోహిత్, ఇప్పుడు ఏకంగా సీనియర్ జట్టు తరఫున మైదానంలోకి దిగుతున్నాడు. జూనియర్ టోర్నీల నుంచి నేర్చుకున్న మెళకువలు, షూటౌట్ వ్యూహాలతో గోల్ పోస్ట్ వద్ద లారీలా అడ్డుగోడగా నిలవడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడటం తన చిన్ననాటి కల అని అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ ఆదిత్య అర్జున్ లాలాగే ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్లు, కోచ్‌లు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ప్రాక్టీస్ సెషన్లో నూటికి నూరు శాతం శ్రమిస్తున్నట్లు చెప్పాడు.
మరో మిడ్‌ఫీల్డర్ రాజిందర్ సింగ్ జట్టు ఐక్యతే తమ అసలైన బలమని స్పష్టం చేశాడు. మైదానంలో ఒకరు పొరపాటు చేస్తే మరొకరు దాన్ని కవర్ చేసేంత అనుబంధం తమ మధ్య ఉందన్నాడు. ప్రపంచకప్ సన్నాహాలు చాలా సీరియస్‌గా జరుగుతున్నాయని డిఫెండర్ యశ్దీప్ సివాచ్ తెలిపాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మాన్ప్రీత్, అమిత్ రోహిదాస్ వంటి దిగ్గజాల నుంచి రక్షణ వ్యూహాలను పక్కాగా నేర్చుకుంటున్నట్లు వెల్లడించాడు.

