కలం, కుంటాల : బీడీ కార్మికులకు నెలకు కనీసం 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న శివాజీ బీడీ యాజమాన్యం స్పందించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కుంటాల మండల కేంద్రంలోని శివాజీ (సంబాజీ) బీడీ హెడ్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా (Beedi Workers Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పని దినాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని కల్పిస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.
నాణ్యమైన ఆకు, పొగాకు సరఫరా చేయకుండానే బీడీలు తయారు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బీడీ తయారీనే నమ్ముకుని జీవిస్తున్న తమకు ఇతర పనులు తెలియవని, పని దినాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మహారాష్ట్రలో శివాజీ బీడీ యాజమాన్యం కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పిస్తున్నట్లుగానే తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని, సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు (Beedi Workers Protest) ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం యాజమాన్య కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Also Read : ఏనుగు విగ్రహం మధ్యలో ఇరుక్కుని భక్తుడి అవస్థలు!
Follow Us On: Youtube

