కలం, నిర్మల్: మధ్యాహ్న భోజన కార్మికుల (Midday Meal Workers) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భూక్యా రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, నెలకు రూ.18 వేల వేతనం కల్పించాలని కోరారు.
గ్యాస్ సిలిండర్లు, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. యూనిఫాం, గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు కార్మికులపై ఉపాధ్యాయుల ఒత్తిళ్లను అరికట్టాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు పాఠశాలల్లో వంటలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వహీదా, మండల నాయకులు లలిత, మాధవరావు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

