కలం, స్పోర్ట్స్ : ఒడిశా క్రికెట్ సంఘం (Odisha Cricket Association) ఎన్నికల వ్యవహారం ఇప్పుడు భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. 2025లో అమలులోకి వచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ క్రికెట్‌కు వర్తిస్తుందా? లేక ప్రస్తుత బీసీసీఐ(BCCI) రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఒడిశా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో బీసీసీఐ కీలక విషయాలను వెల్లడించింది. ఒడిశా క్రికెట్ సంఘం ఎన్నికలు ప్రస్తుత బీసీసీఐ రాజ్యాంగం ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫార్సుల అనంతరం 2019లో బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించిన విషయం తెలిసిందే.
క్రికెట్‌కు కొత్త స్పోర్ట్స్ చట్టం వర్తించదా?
క్రికెట్‌ను నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఇంకా ‘డిజిగ్నేటెడ్ స్పోర్ట్’గా నోటిఫై చేయలేదని బీసీసీఐ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అందువల్ల ప్రస్తుతం ఈ చట్టంలోని నిబంధనలు క్రికెట్‌కు వర్తించవని బీసీసీఐ వాదిస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికలపై కొత్త సందిగ్ధతకు దారితీసింది. స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ గత డిసెంబర్‌లో ఎన్నికలను 2026 డిసెంబర్ వరకు వాయిదా వేసుకునే అవకాశం ఇచ్చిందని కొన్ని రాష్ట్ర సంఘాలు భావిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఎన్నికలను ఆలస్యం చేయకుండా సకాలంలో నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.
రెండు టర్మ్‌ల తర్వాత కూలింగ్ ఆఫ్
ప్రస్తుత బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండు టర్మ్‌లకు మించి ఎవరూ పదవిలో కొనసాగకుండా నిబంధనలు ఉన్నాయి. రెండు వరుస టర్మ్‌లు పూర్తయిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా ఉంది. ఈ నిబంధనల ప్రకారమే రాష్ట్ర క్రికెట్ సంఘాలలో ఎన్నికలు జరగాలని బీసీసీఐ పేర్కొంటోంది. మరోవైపు కొత్త నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్‌లో కూలింగ్ ఆఫ్ నిబంధన లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర క్రికెట్ సంఘాలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలా? లేక బీసీసీఐ రాజ్యాంగాన్నే అనుసరించాలా? అనే విషయంలో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి. ఒడిశా క్రికెట్ సంఘం ఎన్నికలపై దాఖలైన కేసులో ఒడిశా హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1న చేపట్టనుంది. ఈ విచారణ అనంతరం ఎన్నికల నిర్వహణ, బీసీసీఐ రాజ్యాంగం, కొత్త స్పోర్ట్స్ చట్టం అమలుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

