బీసీల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలి: శ్రీనివాసరావు

కలం, బోనకల్: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీ సామాజికవర్గం తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురవుతోందని బీసీ హక్కుల సాధన సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు (Mekala Srinivasa Rao) అన్నారు. బీసీల హక్కుల (BC Rights) సాధనకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం బోనకల్ (Bonakal) మండల కేంద్రంలో బీసీ హెచ్ఎస్ఎస్ మండల కమిటీ సమావేశం కొంగర భాస్కరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనాభాలో అధిక వాటా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీల వాస్తవ జనాభా లెక్కలు తేల్చేందుకు సమగ్ర కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో న్యాయం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బీసీ వృత్తిదారులు సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానం విస్తరణతో వృత్తులు సంక్షోభంలో పడి జీవనోపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

వృత్తిదారుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని శ్రీనివాసరావు కోరారు. 2027లో జరిగే దేశ జనగణనలో ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించి కులగణన చేపట్టాలని, బీసీ జనాభా ప్రాతిపదికన చట్టసభలు, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమీలేయర్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు అర్హులైన బీసీలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. బీసీల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా ఈ నెల 13న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించనున్న బీసీ హక్కుల సాధన సమితి జిల్లా రెండో మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల రామారావు, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి ఆకెన పవన్, బీసీ నాయకులు గొల్లపల్లి కృష్ణారావు, విద్యాసాగర్, వంగాల హనుమంతరావు, తోట నాగరాజు, జక్కుల గోపి, శ్రీ బ్రహ్మం, నాగులు మీరా, బంగారం నరేంద్ర, మరీదు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>