కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వేదికగా తెలంగాణకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీరును తెలంగాణ బీసీ ఇంటెల్లెక్చువల్ ఫోరం (BC Intellectual Forum) తీవ్రంగా ఖండించింది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రతినిధులు సైతం ఆయన కామెంట్లను తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో “తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు..” అంటూ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు బక్కని నర్సింలు చేసిన కామెంట్‌ను ఫోరం చైర్మన్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు (Chiranjeevulu) ఖండించారు. ఆయనపై చంద్రబాబు నాయుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చరిత్రను పరిశీలిస్తే తెలుగు పదం పుట్టిందే తెలంగాణలో అని వివరించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండడం నచ్చనందుకు భాషను, యాసను అవమానిస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది అక్కడి ప్రాంతానికి సేవ చేయాలని, కానీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పక్క రాష్ట్రంలో చిచ్చు రాజేసే తీరుల వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం ఒప్పుకోదన్నారు. పవన్ పలికే పలుకులన్నీ చంద్రబాబు, బీజేపీ పలుకులుగానే ఉన్నాయన్నారు.
తెలంగాణలో పోటీ చేస్తే ఆపుతున్నదెవరు?
తెలంగాణ మీ అయ్య జాగీరా.. అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు యావత్తు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని చిరంజీవులు వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడ పోటీ చేశారని, ఇప్పుడు పోటీ చేస్తానంటే ఎవ్వరూ అడ్డుకోరని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసన్నారు. కొండగట్టు ఆలయానికి పైసలు ఇచ్చానంటూ పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలు నిత్యం తిరుమలకు వెళ్తూ భారీ స్థాయిలో కానుకలు ఇస్తున్నరని వివరించారు. తెలంగాణ భాషను, యాసను అవమానించిన పవన్ కల్యాణ్ ఇటీవల “మా చూపుతో కొనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి…” అని చేసిన కామెంట్లను ప్రస్తావించారు. ఆంధ్రుల పాలనతో విసిగిపోయే తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు కలిసే ఉంటున్నారని, నిత్యం ఆటూ ఇటు రాకపోకలు సాగిస్తున్నారని, ప్రశాంత వాతావరయంలో విష బీజాలు నాటే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.
చంద్రబాబు దగ్గర బంట్రోతు ఉద్యోగం : బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేసిన పవన్ కల్యాణ్‌ను అక్కడి ప్రజలే ఆదరించలేదని, రెండు చోట్లా ఓడిపోయారని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గుర్తుచేశారు. చంద్రబాబు దగ్గర ఆయన బంట్రోతు ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఆయన ప్రశ్నించినట్లుగా తెలంగాణ సమాజం సమాధానం “అవును.. తెలంగాణ మా అయ్యల జాగిరే…” అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ఎన్నుకున్నందుకు తొలుత వారికి న్యాయం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉంటూ గండిపేట నీళ్లు తాగుతూ, పారడైస్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే మాటలను బంద్ పెట్టాలని హితవు పలికారు. ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్న చరిత్ర ఆయన కుటుంబానిదన్నారు. మంచి నటుడిగా నటిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, కానీ తెలంగాణ ప్రజల త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ అనే బంట్రోత్‌ను తెలంగాణకు పంపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

