Mobile Popup Ad
Mobile Popup Ad

వేములవాడలో ఆర్టీసీ కార్గో సేవలు బంద్

కలం, కరీంనగర్ బ్యూరో (వేములవాడ) : వేములవాడలో ఆర్టీసీ కార్గో (RTC Cargo) సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా కార్గో సేవలు నిర్వహిస్తున్న కేంద్రం ఒప్పంద గడువు ముగియడంతో పాటు, షాప్ అద్దె భారం అధికంగా ఉండటమే సేవలు స్తంభించడానికి ప్రధాన కారణమని సమాచారం. ప్రతిరోజూ పార్సిల్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, చిన్న వ్యాపారుల సరుకుల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలపై ఆధారపడే ప్రజలు ప్రస్తుతం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. సేవలు నిలిచిపోవడంతో పార్సిల్లు పంపించాలన్నా, స్వీకరించాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్గో కేంద్రం నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా షాప్ అద్దె అధికంగా ఉండటం వల్ల నిర్వాహకులు కొనసాగించలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు ఒప్పంద గడువు ముగిసిన తర్వాత కొత్త ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వేములవాడ వంటి ప్రధాన పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోవడం సమంజసమేనా..? ప్రజలకు అవసరమైన సేవలను పునరుద్ధరించడంలో అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..? తాత్కాలిక అంతరాయమా..? లేక శాశ్వతంగా మూతపడే పరిస్థితులా..? అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్గో సేవల పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

టెండర్‌కు ఎవరూ ముందుకు రాకపోవడమే కారణం – డిపో మేనేజర్ శ్రీనివాస్

కార్గో సేవలు శాశ్వతంగా నిలిచిపోలేదని వేములవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్గో నిర్వహణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయిందని, త్వరలోనే కొత్త టెండర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. కార్గో టెండర్‌కు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కార్గో సేవలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు డిపో అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, కార్గో సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>