కలం, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో 194 పరుగుల భారీ ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. అనంతరం లండన్‌లోని క్లారెన్స్ హౌస్‌లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ కావాలని జట్టు మొత్తానికి ఆదేశాలు వచ్చాయి. అయితే బోర్డు ప్రవర్తనకు నిరసనగా జట్టు నుంచి తొలగించిన ఓ ఆటగాడు ఈ భేటీకి వెళ్లకుండా బహిష్కరించారు. ఈ పర్యటనలో మూడో టెస్టుకు ముందు రాజకుటుంబంతో భేటీ కావడం ఆనవాయితీగా వస్తోంది.
నలుగురే హాజరు..
తొలగించిన ఏడుగురిలో మహమ్మద్ అవైస్ జఫర్, అమీర్ జమాల్, ఖుర్రమ్ షెహజాద్, అలీ ఉస్మాన్ అనే నలుగురు ఆటగాళ్లు హాజరయ్యారు. మరో ఇద్దరు ఆటగాళ్లు హాజరయ్యేందుకు ఇష్టం లేదని చెప్పగా, ఏడో ఆటగాడు మాత్రం ఏకంగా హాజరుకాకుండా తన నిరసన వ్యక్తం చేశారు. ఈ వివాదం పక్కన పెడితే క్లారెన్స్ హౌస్‌లో జరిగిన సమావేశం ప్రశాంతంగా ముగిసింది. కింగ్ చార్లెస్ ఆటగాళ్లను పరామర్శించి ప్రోత్సహించారు.
ఇంకా ప్రకటన కాలేదు..
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సంతకం చేసిన బ్యాట్‌ను, పిసిబి అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఒక కానుకను రాజుకు బహుకరించారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌ను కేవలం గౌరవం కోసమే ఆడనుంది. తొలగించిన ఏడుగురు ఆటగాళ్ల స్థానంలో కొత్తవారి పేర్లను ఇంకా ప్రకటించలేదు. గత పది రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket)లో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే రెండవ టెస్టులో మైదానంలోకి దిగబోమని జట్టు బెదిరించింది. ఆ తర్వాత జట్టులో చేసిన మార్పులపై మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు రాగా, సెలెక్టర్లకు బోర్డు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

