కలం, మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్రం మొత్తం ఇదే దుస్థితి కొనసాగుతోందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ (Lingala Kamal Raj) మండిపడ్డారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గత బీఆర్ఎస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు మొండిచేయి చూపుతున్నారని ఆరోపించారు. దెందుకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో ఒంటరి దళిత మహిళలకు కనీసం ఇల్లు కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కమిషన్లు రావనే ఉద్దేశంతోనే నిజమైన అర్హులకు ఇళ్లు ఇవ్వడం లేదని కమల్ రాజ్ ఆరోపించారు.
ప్రజల అవసరాల కోసం కాకుండా కేవలం కమిషన్ల కోసమే ప్రజలకు ఎలాంటి అవసరం లేని ఓఆర్ఆర్ నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు. గతంలో 2009 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గేదెల పంపిణీ పేరుతో ఒక్కో మహిళా లబ్ధిదారుడి వద్ద రూ.1,100 వసూలు చేశారని, ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా రూ.2,400 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తామని హామీలిచ్చి మోసం చేస్తున్నారని, నేడు ప్రజా ప్రభుత్వంలో కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన వెంటే తిరిగే కాంట్రాక్టర్లు మాత్రమే ప్రజల సొమ్మును దోచుకుని కోటీశ్వరులయ్యారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి మధిరకు వస్తున్న వారు ఇక్కడి అస్తవ్యస్త రహదారులను చూసి అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ వెంటనే ఇళ్లు ఇవ్వాలని, కుల, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కమల్ రాజ్ డిమాండ్ చేశారు.

