కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని బాన్సువాడ (Banswada) మండల పంచాయతీ అధికారి(MPO) నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాలను సక్రమంగా అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు ఎంపీవో నాగరాజును సస్పెండ్ చేసి, హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ ఎంపీవోపై తీసుకున్న చర్య జిల్లా అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

