కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా విద్యార్థుల ఆర్టీసీ బస్సు సమస్యపై బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) వెంటనే స్పందించారు. కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయించారు.
ఈ నెల 7వ తేదీన బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కిష్టాపూర్, బీర్కూర్ పరిసర గ్రామాలకు చెందిన SRNK డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యను పోచారం దృష్టికి తీసుకువచ్చారు. సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలియజేయడంతో పోచారం వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వెంటనే బాన్సువాడ నుంచి ఆయా గ్రామాల మీదుగా SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ను శుక్రవారం బాన్సువాడ బస్టాండులో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు.
తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయించిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్, SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

