కలం, వెబ్ డెస్క్: బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు అమ్మడంపై (Banks Mis Selling) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ అనంతరం ఆర్థిక మంత్రి ఏటా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సెంట్రల్ బోర్డుతో నిర్వహించే సంప్రదాయ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులు అమ్మడంపై వ్యాఖ్యానించారు.
‘బ్యాంకులు దేనికోసమైతే ఉన్నాయో ఆ పనిపైనే అవి దృష్టి పెట్టాలి. అదే వాటి డ్యూటీ. అంతేకానీ, కస్టమర్లకు అవసరం లేని/ఇష్టపడని ఇన్సూరెన్స్‌లు వంటి ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించే విధంగా అమ్మడం(మిస్–సెల్లింగ్) వాటి పని కాదు. దీనివల్ల ఆర్బీఐ, ఐఆర్డీఏఐలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. బ్యాంకుల మిస్–సెల్లింగ్‌పై నాకు మొదటి నుంచీ ఆందోళన ఉంది. ఇలాంటి చర్యలు భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరం’ అని ఆమె స్పష్టం చేశారు.
కాగా, మిస్–సెల్లింగ్‌పై (Banks Mis Selling) ఈ నెల 11న ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారం.. కస్టమర్‌ను తప్పుదోవ పట్టించి ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి ఉత్పత్తి/సేవను విక్రయించినట్లు తేలితే.. సంబంధిత బ్యాంకులు కస్టమర్ చెల్లించిన సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అలాగే ఆ మిస్-సెల్లింగ్ వల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను వచ్చే నెల 4వ తేదీ వరకు తెలపవచ్చు.


