కలం, కరీంనగర్ బ్యూరో: ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని అన్నారు.
సోమవారం కరీంనగర్ (Karimnagar) మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్‌లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బాధితుల ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. సేల్స్ మేనేజర్‌కు బుల్లెట్ గాయం కాగా, వెంటనే శస్త్రచికిత్స చేయడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది దారుణమైన సంఘటన అని, గాయపడిన వారిని పరామర్శించడం మానవత్వమని చెప్పారు. అయితే ఈ ఘటనకు తమకు సంబంధం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం సరికాదని విమర్శించారు.
దొంగలు దాడి చేసే సమయంలో ఎవరి ఇళ్లు దగ్గరగా ఉన్నాయో చూసి వస్తారా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్న ఆయన, దీనిపై ఇప్పటికే డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు. దుండగులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పినట్లు చెప్పారు. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress Mukt Bharat) లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తల త్యాగాల వల్లే విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని ప్రజలు నమ్ముతున్నట్లు తెలిపారు.
Read Also: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్!
Follow Us On : WhatsApp

