Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో ఉండాలంటే వందేమాతరం ఆలపించాల్సిందే : బండి సంజయ్​

కలం, కరీంనగర్​ బ్యూరో​ : ఈ దేశంలో ఉండాలంటే ఎవరైనా సరే కచ్చితంగా వందేమాతరం ఆలపించాల్సిందేనని, తాము అధికారంలోకి వస్తే అందరితో వందేమాతరం పాడిస్తామని, లేనిపక్షంలో లోపలేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. గురువారం కరీంనగర్​ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్నా స్పీకర్ కనీసం మందలించకపోవడం శోచనీయమని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సీఎం, స్పీకర్ ఇలాంటి ధోరణిని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తీరును ఎండగడతామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ నడిపే కళాశాలల్లోనే ఉగ్ర మూలాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘తొక్కుకుంట వచ్చిన’ అనే వ్యాఖ్యలపై బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోని ఒక నేత రహస్య సమావేశం నిర్వహించారనే కారణంతోనే, సీనియర్ నాయకులను బెదిరించేందుకే సీఎం ఈ భాషను వాడుతున్నారని విమర్శించారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచే నిధులు మళ్లుతున్నాయని, రాహుల్ గాంధీ ఆ ఎన్నికల బాధ్యతలను రేవంత్ రెడ్డికే అప్పగించారని విమర్శించారు. రాబోయే కాలంలో తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కేరళలో కూడా పార్టీ గణనీయంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై ప్రజలు నవ్వుకుంటున్నారని, ప్రస్తుతం శాసనసభ, స్పీకర్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు.

కేంద్రం క్రమం తప్పకుండా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వాయిదాల విషయంలో మాట తప్పుతోందని విమర్శించారు. ఈ నెల 22న రైతు భరోసా ఇస్తామని చెప్పిన సీఎం, ఐదు వాయిదాల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, కూలీలకు ఇచ్చిన వాగ్దానాలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఫామ్‌హౌస్‌కు పరిమితమైందని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో గుజరాత్ సబర్మతి తరహాలో ప్రజలకు తగిన పరిహారం ఇచ్చి పనులు చేపట్టాలని, బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడాన్ని బీజేపీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని అహంకారాన్ని వీడి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని బండి సంజయ్​ (Bandi Sanjay) ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>