భవానీ మాల ధరించిన బండి సంజయ్.. 11 రోజులపాటు ఆలయంలోనే!

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) భవానీ దీక్ష (Bhavani Deeksha) చేపట్టారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌ (Karimnagar) లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలాధారణ గావించి ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్ష చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

11 రోజులపాటు ఆలయంలోనే..

నేటి నుండి 11 రోజుల పాటు బండి సంజయ్ దీక్షలో కొనసాగనున్నారు. ఈ 11 రోజులు పూర్తిగా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో తరించనున్నారు. వివిధ సమస్యల నిమిత్తం కేంద్ర మంత్రిని కలిసేందుకు వచ్చే వారందరినీ ఆలయ ఆవరణలోనే కలుసుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక టెంట్ ఏర్పాటు చేశారు.

మరోవైపు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాశక్తి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ పరిసరాలన్నింటినీ దీప కాంతులతో నింపేశారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్వహించనున్న ఆధ్మాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుండి మహాశక్తి అమ్మవారు రోజుకో పూజ అందుకోనున్నారు. భారీ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ సహా వివిధ జిల్లాల ప్రజల అడుగులన్నీ కరీంనగర్‌లోని ‘మహాశక్తి అమ్మవారి ఆలయం’ వైపే పడుతున్నాయి.

ఈరోజు శుక్రవారం కావడంతో భవానీ దీక్షాధారులు, భక్తులతో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో కర్త, కర్మ, క్రియలా అన్నీ తానై వ్యవహరిస్తూ భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అమ్మవార్లను ప్రశాంతమైన వాతావరణంలో మనస్పూర్తిగా దర్శించుకునేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సకల సౌకర్యాలు కల్పించారు.

అంతే కాకుండా భవానీ మాలాధారణ చేసిన దీక్షాపరులకు భోజన, పూజా వసతులను కల్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలను అందజేయనున్నారు. భవానీ మాలాధారులు సహా అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతిరోజు 5 నుండి 10 వేల మంది భక్తులకు భోజన, అల్పాహారాలను అందజేసేలా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

16 ఏళ్ల క్రితం శ్రీమహాశక్తి ఆలయం ప్రతిష్టించారు. తొలిరోజుల్లో బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది మాత్రమే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాలను ధరించి దీక్ష తీసుకునేవారు. ఈ 16 ఏళ్లలో ఊహించని రీతిలో భవానీ దీక్షాపరుల సంఖ్య ఎక్కువైంది. గత రెండేళ్లలో దుర్గామాల వేసుకునే యువకుల సంఖ్య వేలల్లో ఉంది. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలతో దీక్ష ధరించి అమ్మవారిని కొలుస్తున్నారు. దుర్గామాత దీక్షాపరులతో ఈ పుణ్యక్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాల్లో సందడిగా మారబోతోంది. 108 రోజుల దీక్ష… మండల దీక్ష… నవరాత్రి దీక్ష… ఎన్ని రోజులు దీక్ష చేసినా లక్ష్యం ఒక్కటే… “అమ్మవారి ఆశీస్సులు పొందాలి… అమ్మను నమ్ముకుని ముందుకు సాగాలి.” అన్నదే భక్తుల సంకల్పంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>