కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ లో ఈసారి గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay).. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావును ఆదేశించారు. శుక్రవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కరీంనగర్ లోని సీతారాంపూర్, ఆరెపల్లి, మెహర్ నగర్, వావిలాలపల్లి, ప్రశాంత్ నగర్, ఆదర్శనగర్, డాక్టర్స్ స్ట్రీట్, అశోక్ నగర్, చైతన్యపురి, మర్వాడీ మందిర్, కోతిరాంపూర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు.

ఆయా కాలనీల్లో కొలువైన గణనాథులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లపై మేయర్, డిప్యూటీ మేయర్ తో చర్చించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించినందున ప్రజల ఆకాంక్షల మేరకు గతం కంటే ఘనంగా నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా అధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేంద్ర మంత్రి సూచనల మేరకు..

కేంద్ర మంత్రి సూచనల మేరకు గతం కంటే ఘనంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను చేసేందుకు నగర పాలక సంస్థ సిద్ధమైంది. గతేడాది ఉత్సవాల నిర్వహణ కోసం రూ.70 లక్షలు మాత్రమే కేటాయించగా, ఈసారి నిమజ్జన ఉత్సవాల నిర్వహణ కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు కేటాయించారు. దీనికి అదనంగా నగరం మొత్తాన్ని పూలతో, వివిధ రూపాల్లో అందంగా అలంకరణ చేసేందుకు సిద్దమయ్యారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు అందంగా ముస్తాబు చేయాలని నిర్ణయించారు.

పటిష్ట చర్యలు..

నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీళ్లు, ప్రసాదాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. రోడ్లు అక్కడక్కడా గుంతలమయమై నిమజ్జనానికి తరలివెళ్లే గణనాథుడి వాహనాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదమున్నందున, యుద్ద ప్రాతిపదికన ప్యాచ్ వర్క్ చేస్తూ ఆయా ఇబ్బందులను తొలగించేందుకు పనులు ప్రారంభించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఇంతరవకు గణనాథుడిని ప్రతిష్టించిన దాఖలాల్లేవు. బీజేపీ నూతన పాలకవర్గం కొలువైన తరువాత తొలిసారి కార్పొరేషన్ లో గణనాథుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుండటం గమనార్హం.

ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు గతం కంటే ఘనంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. నిమజ్జన ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకోసం ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>