కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై, ఈవీఎం యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈవీఎంల వల్లే కాంగ్రెస్ పార్టీ కేరళ, తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ రాష్ట్రాల్లో గెలిచింది కదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు రాష్ట్రాల సీఎంలు రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు. పదేపదే ఈవీఎంల గురించి, సర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇండీ కూటమికి జనాదరణ లేదు..
సీఈసీ జ్ఝానేశ్ కుమార్ కు, బీజేపీ పార్టీకి ఏం సంబంధం? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన ఎన్డీఏ మంత్రి కాదని.. సీఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని చెప్పుకొచ్చారు. అసలు ఇండీ కూటమికి జనాదరణ లేదని.. వాళ్ల ఆందోళన కార్యక్రమాలకు పట్టుమని 10 మంది కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. ముంబై, ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు జనం పెద్దగా రాకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంవల్లే కేరళలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారు? అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ నేతలు స్పందించక పోవడం సిగ్గుచేటు..
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని ధైర్యంగా భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ను బండి సంజయ్ ప్రశంసించారు. ప్రపంచమంతా మచ్చార్ ధైర్య సాహసాలను కొనియాడతుంటే.. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు . స్మిత్ మచ్చార్ పై దాడి చేసిన వ్యక్తి సామాజికవర్గం ఓట్లు పోతాయోననే భయంతోనే కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదని ఆరోపించారు. స్మిత్ మచ్చార్ సాహసం, తెగువ తెలిసినా.. స్పందించని వాళ్లంతా తన దృష్టిలో దేశద్రోహులు, దిమాగీ నక్సల్సేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

