బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక గ్రామసభలు.. ఎప్పటినుంచంటే?

కలం, నారాయణపేట: భారత ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన – బాల్ వివాహ్ ముక్త్ భారత్ (Bal Vivah Mukt Bharat) పేరుతో 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు రెండు మాసాల పాటు కొనసాగనుంది. ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 27న బాల్య, అకాల, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామసభల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, విద్యా, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహాల నిషేధ చట్టం–2006లోని నిబంధనలను వివరించనున్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజలందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు, యువత, ఇతర గ్రామస్థాయి ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని జిల్లా సంక్షేమ అధికారి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>