కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “చలో హైదరాబాద్” (Chalo Hyderabad) మహాసభను విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో నేడు సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, మాజీ రాష్ట్ర చైర్మన్లు సుగుణాకర్ రావు, కటుకూరి దేవేందర్ రెడ్డి, సురేందర్, రాష్ట్ర సలహాదారు ప్రభాకర్ రెడ్డి, జనగామ సెంటర్ మాజీ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ సెంటర్ చైర్మన్ వి. జితేందర్ రావుతో కలిసి మాట్లాడారు.
1941లో స్థాపించబడిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) దేశంలోని అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక నిర్మాణ రంగ సంస్థల్లో ఒకటని తెలిపారు. స్వాతంత్య్రానికి ముందే ఏర్పడిన ఈ సంస్థ గత 85 ఏళ్లుగా నిర్మాణ రంగ అభివృద్ధి, కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రస్తుతం డ్రెయినేజీ పనుల నుంచి భారీ డ్యామ్‌ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల్లో పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లుల చెల్లింపుల్లో నెలకొన్న జాప్యం, అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాధాన్య పనులను కొనసాగిస్తూ, ఇతర పనులను తాత్కాలికంగా నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని విమర్శించారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఎటువంటి రాజకీయ ప్రభావాలు, సిఫార్సులు లేదా వివక్షకు తావులేకుండా సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. ముందుగా పనులు పూర్తి చేసి, సంవత్సరాలుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, “ముందు వచ్చిన బిల్లుకు ముందు చెల్లింపు” అనే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ల సంఘం సమర్పించిన వినతిపత్రాలు, సూచనలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు గుండెపోట్లతో మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి నిర్మాణ రంగ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లతో పాటు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు, అకౌంటెంట్లు, యంత్రాల ఆపరేటర్లు, డ్రైవర్లు, కార్మికులు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లులు అందకపోవడంతో జీతాలు, బకాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొని, లక్షలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్ల సమస్య మాత్రమే కాదని, నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాల మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని నాయకులు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించే “చలో హైదరాబాద్” (Chalo Hyderabad) మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమని పేర్కొన్న నాయకులు, రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు సహా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్రమ సంఖ్య ప్రకారం పారదర్శకంగా విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. “కాంట్రాక్టర్లను కాపాడండి – తెలంగాణ అభివృద్ధిని కాపాడండి”, “సేవ్ కాంట్రాక్టర్స్ – సేవ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్” అనే నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఏఐ (BAI) నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు బీఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: రూ.1,511 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

