కలం, స్పోర్ట్స్: అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి! అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 పోరులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులో లేకపోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి, అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్‌ను పక్కన పెట్టడంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించినప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అక్షర్ పటేల్ లేకపోవడంతో, అది కేవలం విశ్రాంతి మాత్రమేనని భావించారు. అయితే, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుతో జరుగుతున్న ఈ కీలక పోరులోనూ అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం.
ఈ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, అక్షర్ పటేల్‌ను (Axar Patel) తప్పించడం అత్యంత కఠినమైన నిర్ణయమని అంగీకరించారు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు ఆయన వివరించారు. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కే మేనేజ్‌మెంట్ మరోసారి మొగ్గు చూపింది. దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి కీలకమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండర్లను కట్టడి చేయడంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ కంటే, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎక్కువ ప్రభావం చూపుతారని భావించి ఈ వ్యూహాత్మక మార్పు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో అహ్మదాబాద్ పిచ్‌పై సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా ఆయనకు కలిసొచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి నిలకడగా రాణిస్తున్న అక్షర్‌ను పక్కన పెట్టడం సాహసోపేతమైన నిర్ణయమేనని చెప్పాలి. మరి ఈ వ్యూహం టీమిండియాకు ఏ మేరకు కలిసివస్తుందో మ్యాచ్ ముగిసిన తర్వాతే తెలుస్తుంది.
Read Also: దక్షిణాఫ్రికాతో పోరు.. అక్సర్ పటేలే కీలకం..
Follow Us On : WhatsApp


