16 వేల రాజకీయ పదవులు పోగొట్టారు.. వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఏపీ మంత్రులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో చర్చించారు. ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.

జగన్ సమాధానం చెప్పాలి..

గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి ఎందుకు తగ్గించారో మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.  2019-24 మధ్య 34 శాతం నుంచి 24 శాతానికి ఎందుకు తగ్గించారు? అని అడిగారు. బలహీన వర్గాలకు దాదాపు 16 వేల రాజకీయ పదవులు పోగొట్టారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

34 శాతం రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకం..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తే కనీసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనే చేయలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. బీసీల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన వివాదం ఏర్పడటానికి వైసీపీ నాయకులే కారణమని అన్నారు.

సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 34 శాతం రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతుందని.. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>