కలం, వెబ్ డెస్క్: ఏపీలో రొయ్య రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు తదితర రంగ ప్రతినిధులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారంతో ముందుకు రావాలని కోరారు. పారదర్శక ఫీడ్ ధరల వ్యవస్థపై ప్రభుత్వం సానుకూలంగా పరిశిలిస్తుందని చెప్పారు. సీబా, మత్స్యశాఖ, రైతు సంఘాలు, తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదనంగా 12 వేల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్‌కు రూ.1.50 రాయితీ ఇస్తామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

