కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గోదాములు, మిల్లుల వద్ద వరి ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) జిల్లా శ్రీరంగాపురం మండలం పరిధిలోని లక్ష్మి వారాహి ఇండస్ట్రీ, పెబ్బేరు పరిధిలో రాధాకృష్ణ ఇండస్ట్రీస్ ను కలెక్టర్ (Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా మిల్లుల గోదాముల వద్ద ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాములు, మిల్లుల వద్ద వరి ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో వేగంగా దించుకోవాలని స్పష్టం చేశారు. లారీలలో ఉన్న ధాన్యం పై టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు.
మిల్లుల వద్ద లారీలను ఎక్కువ సమయం వేచి ఉంచకుండా తగ్గించేందుకు గాను హమాలీల (కార్మికుల) సంఖ్యను పెంచుకోవాలని అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను ఎప్పటికప్పుడు అన్‌లోడ్ చేస్తూ రోజువారీ అన్లోడ్ సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు. ధాన్యం నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేయాలని పౌర సరఫరాల అధికారికి సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాధ్, రెవెన్యూ అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

