రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ కొరత: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నా.. రైతులు ఇబ్బంది పడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. నాలుగు వేల మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 1600 మెగా వాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. భద్రాద్రి ప్లాంట్‌లో 540 మెగా వాట్లు, కొత్తగూడెం ప్లాంట్‌లో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు.

ఒక వైపు 40 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారని.. మరి 3,500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఎల్ నినో రాబోతుందని ఆరు నెలల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని.. నీరు, బొగ్గు నిల్వలు సిద్ధం చేసుకోకపోవడం ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా.. అని ప్రశ్నించారు.

చిన్న ప్రాజెక్టుకే రూ.25 వేల కోట్లు ఖర్చు..

తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు 80 టీఎంసీల నీటిని తీసుకురావడానికి రూ.25 వేల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. 80 టీఎంసీలను ఎత్తిపోసే చిన్న ప్రాజెక్టుకే రూ.25 వేల కోట్లు ఖర్చయితే.. 240 టీఎంసీలను తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకెంత ఖర్చవుతుందో తెలియదా.. అని ప్రశ్నించారు.

ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 46,990 క్యూసెక్కుల ప్రవాహం ఉందని.. బ్యారేజ్ గేట్లు ఎత్తి ఉన్నప్పటికీ 96 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోందని హరీశ్ రావు వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నడిపించడానికి కనీసం నీటి మట్టం 93 మీటర్లు అని.. వెంటనే పంపులు ఆన్ చేసినా రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోయొచ్చన్నారు. కానీ, కాళేశ్వరం పంపులు నడిస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందని ప్రారంభించడం లేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>