కలం, హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 27న నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Chahat Bajpai) సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో పర్యాటక శాఖ వివిధ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ (Chahat Bajpai) సూచించారు. యువ టూరిజం క్లబ్ లో నమోదైన విద్యార్థులకు పర్యాటక, వారసత్వ సంపదపై మండల, జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ నెల 24న హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో యోగ కార్యక్రమాలు, 25వ తేదీన పద్మాక్షి జైన దేవాలయం, సిద్దేశ్వరాలయం వద్ద హెరిటేజ్ వాక్ ను నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.
హెరిటేజ్ వాక్ లో యువ టూరిజం క్లబ్ విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా అటవీ శాఖ అధికారి ముకుంద రెడ్డి, డీఈవో గిరిరాజ్ గౌడ్, హనుమకొండ ఏసీపీ నరసింహ రావు, అడిషనల్ డీఆర్డీఏ వెంకటేశ్వర్లు, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఇరిగేషన్ ఈఈ మంగీ లాల్, డీఐఈవో గోపాల్, కేంద్ర పురావస్తు అధికారి అజిత్ కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారి శ్రీనివాస్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

