కలం, స్పోర్ట్స్: ఆసియన్ గేమ్స్‌లో భారత వెయిట్లిఫ్టింగ్కు మళ్లీ పాత కష్టమే ఎదురైంది. 1998 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ మెడల్ రాలేదు. ఇప్పుడు 28 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) బరిలోకి దిగుతున్నారు. ఈసారి భారత్ మహిళల జట్టుకు మీరాబాయితో పాటు జ్ఞానేశ్వరి యాదవ్, సెరామ్ నిరుపమ్ దేవి, హర్జిందర్ కౌర్ ఉన్నారు. మీరాబాయి చానుకు ఈ ఆసియన్ గేమ్స్ ఎంతో కీలకం. ఆసియా క్రీడల్లో మెడల్ సాధించి భారత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎదురుచూస్తున్న సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తన ఖాతాలో ఆసియన్ గేమ్స్ మెడల్ కూడా చేరాలని మీరాబాయి కోరుకుంటున్నారు. మీరాబాయి 49 కేజీల విభాగంలో పోటీ పడనున్నారు. 48 కేజీల విభాగం చాలా కఠినంగా ఉండటంతో 49 కేజీలకు మార్చామని కోచ్ విజయ్ శర్మ తెలిపారు. ఈ మార్పు ఆమెకు బాగా కలిసొచ్చిందని చెప్పారు. జట్టులోని అందరూ బాగా శిక్షణ తీసుకున్నారని, పోటీకి సిద్ధంగా ఉన్నారని విజయ్ శర్మ పేర్కొన్నారు.
మరోవైపు జ్ఞానేశ్వరి యాదవ్‌కు ఇది తొలి ఆసియన్ గేమ్స్. దీంతో ఆమె ఉత్సాహంతో పాటు కొంత టెన్షన్ కూడా ఉందని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రంలోనే రజతం సాధించిన అనుభవంతో ఇక్కడ కూడా మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. సెరామ్ నిరుపమ్ దేవి కూడా జట్టు బాగా సిద్ధమైందని తెలిపారు. దేశం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు.
జపాన్‌కు చేరుకున్న తర్వాత తొలిరోజు ఎదురైన వసతి సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారమయ్యాయని కోచ్ విజయ్ శర్మ తెలిపారు. ఆసియన్ గేమ్స్‌లో భారత మహిళల వెయిట్‌లిఫ్టింగ్ జట్టు పతకంపై ఆశలు పెట్టుకుంది. అనుభవజ్ఞురాలైన మీరాబాయి నాయకత్వంలో ఈసారి 28 ఏళ్ల నిరీక్షణకు ముగింపు వస్తుందా అనేది పోటీ తర్వాత తేలనుంది.

