కలం, స్పోర్ట్స్ : ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ (Asian Youth Boxing) ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రింగ్‌లో ఊచకోత కోశారు. అండర్-19 విభాగంలో ఏకంగా తొమ్మిది మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లి సరికొత్త సంచలనం సృష్టించారు. మరోవైపు సెమీఫైనల్స్‌లో ఓడిన ఆరుగురు బాక్సర్లు భారత్‌కు కాంస్య పతకాలను అందించారు. జూలై 5న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జూలై 16 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ముఖ్యంగా భారత అండర్-19 మహిళల జట్టు అజేయంగా నిలిచింది.
రింగ్‌లోకి దిగిన ఎనిమిది మంది మహిళా బాక్సర్లు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అందరూ ఫైనల్‌కు చేరి క్లీన్ స్వీప్ చేశారు. మహిళల 60 కేజీల విభాగంలో చాహత్ తైపీ బాక్సర్‌పై ఐదు సున్నా తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 75 కేజీల విభాగంలో అన్షిక, 81 కేజీల విభాగంలో ప్రాచి తోకాస్ తమ తైపీ ప్రత్యర్థులపై మొదటి రౌండ్‌లోనే ఆర్‌ఎస్‌సీ (రఫరీ స్టాప్ కాంటెస్ట్) ద్వారా ఈజీగా గెలిచారు. 80 కేజీల విభాగంలో మేఘా షియోకండ్ ప్రత్యర్థిగా ఉన్న వియత్నాం బాక్సర్ మధ్యలోనే తప్పుకోవడంతో మేఘా ఫైనల్‌కు అర్హత సాధించింది.
మరోవైపు పురుషుల అండర్-19 విభాగంలో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్ టికెట్ దక్కించుకున్నారు. 55 కేజీల విభాగంలో ఆదిత్య కొరియా బాక్సర్‌ను రెండో రౌండ్‌లోనే ఆర్‌ఎస్‌సీ ద్వారా ఓడించగా, 90 కేజీల విభాగంలో శుభమ్ రాజ్‌పుత్ కిర్గిజిస్తాన్ బాక్సర్‌పై మూడు రెండు తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించాడు. అయితే పురుషుల సెమీఫైనల్స్ లో ఓటమి పాలైన సికందర్ (60 కేజీలు), మౌసమ్ సుహాగ్ (65 కేజీలు), దేవేంద్ర చౌదరి (75 కేజీలు), సాగర్ (85 కేజీలు) భారత్‌కు కాంస్య పతకాలను ఖాయం చేశారు.

