కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్‌లో(Asian Games 2026) మెడల్‌పై ఆశలు పెట్టుకున్న భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు (Manu Bhaker) నిరాశ ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 181.1 స్కోర్‌తో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం దక్కలేదు. క్వాలిఫికేషన్‌లో 579-20x స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచిన మనూ.. ఎనిమిది మంది షూటర్లతో జరిగిన ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో మనూ ఆరంభంలో మెడల్ రేసులోనే కొనసాగింది. ఒక దశలో 8.9 స్కోర్‌తో ఏడో స్థానానికి పడిపోయిన ఆమె.. 10.1, 10.4 స్కోర్లతో తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత 10.8 స్కోర్‌తో మెడల్ రేసులోకి వచ్చి, మరో 10.8తో మూడో స్థానానికి చేరుకుంది. అయితే అనంతరం వచ్చిన 9.6 స్కోర్ ఆమె అవకాశాలను దెబ్బతీసింది. 18వ షాట్ తర్వాత 181.1 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ నుంచి నిష్క్రమించింది.
ఫలితం అనంతరం మనూ భాకర్ భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా తన మాజీ కోచ్ జస్పాల్ రాణా గురించి మాట్లాడుతున్న సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. జూన్‌లో రాణా మృతి చెందగా, తన షూటింగ్ ప్రయాణంలో ఆయన ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని మనూ గుర్తుచేసుకుంది. జీవితంలో ఏ సమయంలోనైనా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, తన ప్రక్రియపై నమ్మకం ఉంచాలని రాణా చెప్పేవారని తెలిపింది. గత కొన్ని నెలలు తనకు ఎంతో కష్టంగా గడిచాయని మనూ పేర్కొంది. రాణాతో పాటు తన అమ్మమ్మను కూడా కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుంది. మెడల్ కోసం తాను పూర్తిస్థాయిలో ప్రయత్నించానని, ఈసారి పోడియంపై నిలవలేకపోవడం నిరాశ కలిగించిందని తెలిపింది. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తానని మనూ భాకర్ పేర్కొంది.

