మాటలు కాదు.. కరివెన పనులను కార్యాచరణలో చూపాలి: బండారి శాంతికుమార్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కాగితాల్లో చెప్పడం కాదని, కార్యచరణతో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతికుమార్ (Bandari Shanthi Kumar) అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకులు ఎగ్గని నర్సింహులు ఆధ్వర్యంలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతికుమార్ పాలమూరు బీజేపీ నాయకులతో కలిసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన (కురుమూర్తిరాయ) రిజర్వాయర్‌ (Karivena Reservoir) ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం భూత్పూర్ మండలం గోప్లాపూర్ లో ఆ పార్టీ కార్యకర్త గంగాపురం రవీందర్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితి, పెండింగ్ పనులు, కాల్వల నిర్మాణం, భూసేకరణ, R&R (పునరావాసం–పునఃస్థిరీకరణ) తదితర అంశాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి పాలమూరు రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొన్నారు.

పాలమూరు ప్రజలు తేదీల మీద తేదీలు విని విసిగిపోయారనీ, ఇప్పుడు కావాల్సింది కొత్త ప్రకటనలు కాదు.. రైతు పొలానికి కృష్ణమ్మ నీళ్లు అందితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టని శాంతి కుమార్ అన్నారు. ఆ నీళ్లు కాల్వల ద్వారా చివరి ఆయకట్టు రైతు పొలానికి చేరినప్పుడే అసలైన లక్ష్యం నెరవేరుతుంది అని అన్నారు. కరివెన రిజర్వాయర్ వరకు మెయిన్ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయో ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

డిసెంబర్‌కు ఇంకా కొద్ది నెలలే ఉన్నాయనీ, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు ఇంకా ఎందుకు వేగం పుంజుకోలేదు? ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి పనులు ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలనీ డిమాండ్ చేశారు. కేవలం గడువులు ప్రకటించడం కాదు.. ఆ గడువులోగా పనులు పూర్తి చేసే కార్యాచరణ కూడా కనిపించాలి” అని అన్నారు.

ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాసం, R&R పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎవరు మొదలుపెట్టారు.. ఎవరు క్రెడిట్ తీసుకుంటారు అన్నది తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు పాలమూరు రైతుకు నీళ్లు ఇవ్వాలనే సోయి ఉండాలన్నారు. ప్రభుత్వం మాటలు చెప్పడం బంద్ చేసి, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి అని శాంతికుమార్ స్పష్టం చేశారు.

“కరివెన నిండాలి.. కాల్వల్లో కృష్ణమ్మ పరుగెత్తాలి.. పాలమూరు పొలం పండాలి!” అప్పుడే పాలమూరు రైతుల స్థితిగతుల్లో మార్పు వస్తుందని బండారి శాంతికుమార్ పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో బీజేపీ రాష్ట్ర నాయకులు పడకుల బాలరాజు, అచ్చుగట్ల అంజయ్య, నంబి రాజు, రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నిరంజన్, నాగరాజు, శేఖర్ రెడ్డి, రవీందర్, నిరంజన్, ఆంజనేయులు, సుధీర్, పిల్లి సూర్యనారాయణ, అవినాష్, సదానంద్, బుచ్చిబాబు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>