కలం, వెబ్ డెస్క్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy)కి మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్‌ను ఉప్పరపల్లి కోర్ట్ కొట్టేసింది. నేషనల్ పోలీస్ అకాడమీలో అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు గాను తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో, ఆయన చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు మరో పిటిషన్ వేశారు. ఇది ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. అకాడమీలో మహిళా ట్రైనీని వేధించిన కేసులో ఉదయ్‌కృష్ణా రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.
కస్టడీలోకి తీసుకుంటేనే..
ఉదయ్‌కృష్ణా రెడ్డి అశోక్ నగర్ లో ఉంటున్న అద్దె గదిలో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో ప్రేమ లేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఉదయ్ వాడుతున్న ఐ ఫోన్, ల్యాప్ టాప్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వివాహితతో ఉదయ్ సాన్నిహిత్యంగా ఉండేవాడని కూడా గుర్తించారు. వీటి వెనుక ఏదైనా ఆర్థిక లావాదేవీల కోణం ఏదైనా ఉందా.. అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సమాచారం.

