కలం, వెబ్ డెస్క్: వరంగల్‌లో నిర్మాణం కాబోయే ఎయిర్‌పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వి సయ్యద్ అల్లాఉద్దీన్ పేరు పెట్టాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కోరారు. ఆయనది కూడా వరంగల్ జిల్లా అనే పేర్కొన్న అసద్.. మక్కా మసీద్ ఇమాంగా కూడా సేవలందించినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘1930లో మామూనూరులో నిజాం నిర్మించిన ఈ విమానాశ్రయం దేశంలోనే పురాతనమైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటి. అప్పట్లో వరంగల్‌లోని ఆజాం జాహీ మిల్లు వంటి పరిశ్రమల కోసం దీన్ని ఉపయోగించేవారు’ అని గుర్తు చేశారు.
బ్రిటీషర్లపై పోరాడి..
ఎయిర్‌పోర్టు పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘ఈ ఎయిర్ పోర్టుకు మౌల్వి సయ్యద్ అల్లాఉద్దీన్ పెట్టడం సముచితంగా ఉంటుంది. 1857, జులై 17న బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీపై తుర్రేబాజ్ ఖాన్‌తో కలిసి దాడి కూడా చేశారు. అనంతరం, ఆయన్ను సెల్యూలర్ జైల్లో బంధించారు. ఆయన్ను సముచితంగా గౌరవించాలంటే వరంగల్‌లోని ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలి’ అని లేఖలో కోరారు.

