SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను (SIR process) సవాల్ చేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియలో నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని, పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని ఒవైసీ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి మ్యాపింగ్ వంటి నిబంధనలు ఓటర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ప్రక్రియను నిర్వహించాలని తన పిటిషన్‌లో అభ్యర్థించినట్లు సమాచారం.

గురువారం విచారణకు అభ్యర్థన

ఒవైసీ తరఫున న్యాయవాది నిజాముద్దీన్ పాషా, ఈ పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని, సంబంధిత పిటిషన్లతో కలిపి విచారణకు జాబితా చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ తెలిపారు. అయితే ఈ SIR ప్రక్రియపై ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ పిటిషన్ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ల జాబితా సవరణ విధానం, దాని అమలుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>