కలం, మెదక్ బ్యూరో: రాజకీయంగా ఎప్పుడూ పరస్పర విరుద్ధంగా వ్యవహరించే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు (Harish Rao) 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. సంగారెడ్డిలోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసంలో జరిగిన వివాహ వేడుకకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ అనూహ్య కలయిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2004లో హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఛాంబర్లో కలిసి భోజనం చేసేవారమని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇద్దరం వ్యక్తిగతంగా కలుసుకోలేదని, గత పదేళ్లలో ఇద్దరం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ కలిసే అవకాశం రాలేదన్నారు.
కుటుంబ వేడుకకు హరీష్ రావును ప్రత్యేకంగా ఆహ్వానించానని, ఈ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరని పేర్కొన్నారు. పార్టీల మధ్య విభేదాలు ఉన్నా వ్యక్తిగత ఆప్యాయతలకు అవి అడ్డంకి కావని ఈ సమావేశం చాటిచెప్పింది.

