కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని అరుణాచలం (Arunachalam) గిరిప్రదక్షిణ మార్గంలో దారుణ ఘటన వెలుగుచూసింది. 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అడి అన్నామలై ప్రాంతం నుంచి ఇద్దరు యువతులను బలవంతంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు వారిపై దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అనంతరం బాధితుల నగ్న వీడియోలు చిత్రీకరించి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విచారణలో మొత్తం 11 మంది నిందితులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వాసుదేవన్, ఆకాష్, అప్పు సహా 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

