Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో మంగళవారం కరీంనగర్ (Karimnagar) కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్ (Arrive Alive)’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథులుగా హాజరై రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. గతేడాది జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో అధికంగా ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ వంటి కారణాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

జిల్లాలో 96 గ్రామాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు. ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>