Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ చోరీ ఘటన.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నడిబొడ్డున దుండగులు రెచ్చిపోయారు. జ్యోతి నగర్‌లోని ప్రఖ్యాత PMJ జ్యువెలరీ దుకాణంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దుండగులు చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులతో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి, నగలతో ఉడాయించారు. ​దోపిడీ ముఠా షాపులోకి ప్రవేశించిన వెంటనే అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. ​షాపు సిబ్బందిని బెదిరించి, వారి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. వాష్ రూమ్‌లో దాక్కున్న మహిళా సిబ్బందిని కూడా బయటకు లాగి, నగలను బ్యాగుల్లో సర్దుకున్నారు. ​బయటకు వచ్చే క్రమంలో అడ్డుకోబోయిన సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ​గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకులపై పరారయ్యారు. ​

సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దుండగులు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడుతున్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాలో ఒకరు మాస్క్ ధరించగా, మిగిలిన నలుగురి ఫోటోలను పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విడుదల చేశారు. ​కరీంనగర్ సీపీ గౌష్ ఆలం నేతృత్వంలో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దుండగులు రాజన్న సిరిసిల్ల జిల్లా వైపు వెళ్లినట్లు గుర్తించి, జిల్లా సరిహద్దులను దిగ్బంధించారు. ​ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సభ్యులు నిందితుల వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు.

​దర్యాప్తులో కీలకాంశాలు

​పోలీసులు ప్రస్తుతం రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించారు. నిందితులు వాడిన బైకుల ఇంజన్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా అవి ఎక్కడివనేది ఆరా తీస్తున్నారు. ​పరారయ్యే క్రమంలో నిందితులు ఒక తుపాకీ మ్యాగజైన్‌ను కింద పడేసుకున్నారు. ఇది కంట్రీ మేడ్ తుపాకీదా లేక అక్రమంగా కొనుగోలు చేసినదా అని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ముఠా ప్రొఫెషనల్స్ లాగా వ్యవహరించినప్పటికీ, బయటకు వచ్చే సమయంలో కంగారు పడటం, ఒకరు కింద పడిపోవడం వంటి అంశాలను చూస్తుంటే వీరు కొత్తవారా లేక ఏదైనా ఇతర రాష్ట్రాల ముఠాకు చెందినవారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే వీరిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also:  ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>