కలం, సినిమా : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) కుమారుడు, గాయకుడు ఏఆర్ అమీన్‌కు (AR Ameen) తృటిలో ప్రమాదం తప్పింది. చెన్నైలో జరిగిన కారు ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం తెల్లవారజామున అమీన్ తన స్నేహితుడు భార్గవ్‌తో కలిసి కోయంబేడు నుంచి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే అమీన్ ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వస్తున్న ఓ కాల్ టాక్సీ బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ అమీన్, ఆయన స్నేహితుడు భార్గవ్, టాక్సీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా.. ప్రాధమిక చికిత్స అనంతరం వారిని డిస్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

