కలం, వెబ్ డెస్క్: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఉద్యమం వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నేడు సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో 15 డిమాండ్లను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఈవీ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వొద్దని నాయకుడు పేర్కొన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ అడ్మిన్ ఈడీకి నేడు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీయే కొనుగోలు చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకంతో వస్తున్న సమస్యలు, మెడికల్, రిటైర్‌మెంట్ సమస్యలపై కార్మికుల్లో ఉన్న ఆందోళనలు తొలగించాలన్నారు. సంస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీకి సంబంధించిన విలువైన స్థలాలను ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు స్పష్టం చేశారు.

